యూఎస్‌లో గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు షాక్.. ఇంటర్వ్యూలకు వెళితే అరెస్టులు

  • అమెరికన్ పౌరుల జీవిత భాగస్వాములను సైతం అదుపులోకి తీసుకుంటున్న అధికారులు
  • వీసా గడువు ముగిసిన వారిని లక్ష్యంగా చేసుకుంటున్న ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీలు
  • శాన్ డియాగో నగరంలో ఎక్కువగా వెలుగుచూస్తున్న ఘటనలు
  • చట్టప్రకారమే అరెస్టులు చేస్తున్నామని స్పష్టం చేసిన ఇమ్మిగ్రేషన్ విభాగం
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఊహించని షాక్ తగులుతోంది. శాన్ డియాగోలోని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కార్యాలయంలో గ్రీన్‌కార్డ్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్ చేస్తున్నారు. వీరిలో అమెరికన్ పౌరులను వివాహం చేసుకున్న జీవిత భాగస్వాములు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

వీసా గడువు ముగిసిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు ఈ అరెస్టులు చేస్తున్నారని ఇమ్మిగ్రేషన్ అటార్నీ సమన్ నస్సేరి తెలిపారు. గత వారంలోనే తన క్లయింట్లలో ఐదుగురిని గ్రీన్‌కార్డ్ ఇంటర్వ్యూల సమయంలో అదుపులోకి తీసుకున్నారని మీడియాకు వివరించారు. వారెవరికీ ఎలాంటి నేర చరిత్ర లేదని, కేవలం వీసా గడువు ముగిసిందన్న కారణంతోనే అరెస్ట్ చేశారని తెలిపారు.

మరో అటార్నీ టెస్సా కాబ్రెరా మాట్లాడుతూ తన క్లయింట్, మెక్సికో జాతీయుడిని ఇంటర్వ్యూ మధ్యలోనే అధికారులు వచ్చి అరెస్ట్ చేసి, సంకెళ్లు వేసి తీసుకెళ్లారని తెలిపారు. అమెరికన్ పౌరురాలైన ఆయన కుమార్తె ద్వారా గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ అరెస్టులపై ఐసీఈ స్పందించింది. దేశ భద్రత, సరిహద్దు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేస్తున్నామని తెలిపింది. చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న వారు, వీసా గడువు ముగిసిన వారు యూఎస్‌సీఐఎస్ కార్యాలయాల్లో ఉన్నప్పటికీ అరెస్టుకు గురవుతారని ఒక ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ అరెస్టులు శాన్ డియాగో కార్యాలయానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్వ్యూకు హాజరుకాకపోతే కేసును రద్దు చేసే ప్రమాదం ఉన్నందున, దరఖాస్తుదారులు తగిన జాగ్రత్తలతో వెళ్లాలని న్యాయవాదులు సూచిస్తున్నారు.


More Telugu News