Mangli: గాయని మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్

Mangli Abuser Arrested for Casteist Slurs
  • స్వయంగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మంగ్లీ
  • పాటతో పాటు కులాన్ని కించపరిచారంటూ ఆరోపణ
  • చట్టం తన పని తాను చేస్తుందన్న మంగ్లీ 
  • ‘మేడిపల్లి స్టార్’ ను అరెస్టు చేసిన పోలీసులు
ప్రముఖ జానపద గాయని మంగ్లీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, కుల దూషణ వ్యాఖ్యలు చేసినందుకు ఒక వ్యక్తిని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మేడిపల్లి స్టార్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాదారుడు మంగ్లీని, ఆమె సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వీడియో పోస్ట్ చేయడంతో, దీనిపై మంగ్లీ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విడుదలైన మంగ్లీ పాట “బాయిలోన బల్లి పలికే” సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ ‘మేడిపల్లి స్టార్’ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోలో మంగ్లీని బూతులు తిడుతూ, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్టీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో మంగ్లీ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఈ ఘటనపై మంగ్లీ నేరుగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, షెడ్యూల్డ్ తెగలను అవమానించడం వంటి ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
ఈ సందర్భంగా మంగ్లీ మాట్లాడుతూ, "నా పాటలు ప్రజలను అలరిస్తాయి. కానీ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు ఎంతో బాధించాయి. ఒక మహిళగా, గిరిజన బిడ్డగా ఇలాంటి అవమానాలు సహించలేను. చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది" అని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని, సోషల్ మీడియాలో మహిళలు, గిరిజన వర్గాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Mangli
Mangli singer
Mangli arrest
Folk singer Mangli
Mangli caste abuse
ST community
SR Nagar police
SC ST Atrocity Act
Medipalli Star
Telugu singer

More Telugu News