మతం ఏదైనా మానవత్వం మర్చిపోకూడదు: మంత్రి నారా లోకేశ్

  • మంగళగిరిలో నూర్ మసీద్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
  • మతం కంటే మానవత్వమే గొప్పదని కీలక వ్యాఖ్యలు
  • భవిష్యత్ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని పిలుపు
  • రాష్ట్ర, దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచన
మతం ఏదైనా మానవత్వాన్ని ఎన్నడూ మరవకూడదని, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన సేవ అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. యువత భవిష్యత్ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరిలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న పావురాల కాలనీలో నూతనంగా నిర్మించిన 'నూర్ మసీద్' ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మస్జీద్‌ను ప్రారంభించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. "మంగళగిరి ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం నాకు దక్కింది. నాకున్న శక్తి మేరకు సేవ చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది. మనతో ఉన్నవారిని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సమాజంలో ఇంకా పేదరికం ఉంది, దానిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి" అని అన్నారు.

తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, "2019లో దేవుడు నాకు ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు. చాలామంది నన్ను ఎగతాళి చేశారు. కానీ, అదే దేవుడు నాకు శక్తిని, పట్టుదలని ఇచ్చాడు. క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తే విజయం తప్పక వరిస్తుంది. కష్టాలు అందరికీ వస్తాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి" అని యువతకు స్ఫూర్తినిచ్చారు. కాలం మారిందని, యువత చదువుపై దృష్టి సారించి భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

2047 నాటికి దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా అందరూ పనిచేయాలని లోకేశ్ కోరారు. "మెరుగైన సమాజ నిర్మాణం కోసం నైతిక విలువలు చాలా అవసరం. ముఖ్యంగా మహిళలను గౌరవించాలి. మన మధ్య విభేదాలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు, అలాంటి వాటికి తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. ప్రజలు నా పనిని గుర్తించినప్పుడే నాకు కొండంత బలం. అందరికీ అండగా ఉంటూ, కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దాం" అని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలీ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు, మసీదు వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ మహమ్మద్ అలీ, కమిటీ సభ్యులు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.


More Telugu News