బంగాళాఖాతంలో 'దిట్వా' తుపాను... 'దిట్వా' అంటే ఏంటో తెలుసా?

  • శనివారం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంపై ప్రభావం చూపే సూచన
  • తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక
  • ప్రధాన పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ.. మత్స్యకారులు అప్రమత్తం
నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ గురువారం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది గురువారం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపానుకు 'దిట్వా' అని నామకరణం చేశారు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సభ్య దేశాల జాబితా ప్రకారం యెమెన్ దేశం ఈ పేరును సూచించింది. యెమెన్‌కు చెందిన సోకోత్రా ద్వీపంలో 'దిట్వా లగూన్' అనే పేరుతో ఒక చాలా ప్రసిద్ధమైన, అందమైన ఉప్పునీటి సరస్సు ఉంది. ఇప్పుడు ఆ ప్రదేశం పేరునే, బంగాళాఖాతంలో ఏర్పడే తుపానుకు పెట్టారు.

 ప్రస్తుతం సముద్రంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వ్యవస్థ మరింత బలపడి తీరం వైపు కదులుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఈ తుపాను వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరప్రాంతాన్ని దాటి, శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరితో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వైపునకు చేరుకుంటుందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను కదలికలను నిరంతరం గమనిస్తూ, ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసేందుకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సన్నద్ధమైంది.

చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) అంచనాల ప్రకారం, గురువారం దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం తీవ్రత మరింత పెరగనుంది. ముఖ్యంగా డెల్టా, దాని పరిసర జిల్లాల్లో శుక్రవారం నాడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం నాటికి ఈ వాతావరణ వ్యవస్థ తీరం వెంబడి ఉత్తరం వైపు కదులుతున్న కొద్దీ, ఉత్తర తమిళనాడు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు వివరించారు.

ఇదిలా ఉండగా, ఈశాన్య ఇండోనేషియా, మలక్కా జలసంధిపై కేంద్రీకృతమైన 'సెన్యార్' అనే మరో తుపాను తూర్పు వైపుగా కదులుతోంది. అయితే ఈ తుపాను వల్ల తమిళనాడుకు గానీ, భారత తీరానికి గానీ ఎలాంటి ముప్పు లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.


More Telugu News