సర్పంచ్ పదవి కోసం పెళ్లి.. అయినా తీరని యువకుడి కల

  • కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచి స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్
  • పదవి కోసం ఎస్సీ మహిళను పెళ్లి చేసుకున్న యువకుడు
  • గ్రామంలో ఓటు హక్కు నమోదు కాకపోవడంతో దక్కని ఫలితం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో రిజర్వేషన్ల కారణంగా పలు విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామ సర్పంచి, వార్డ్ మెంబర్ల రిజర్వేషన్ కారణంగా కొందరికి వద్దన్నా పదవులు వచ్చిపడుతుండగా.. మరికొందరికి మాత్రం ఎంత ఆరాటపడ్డా పదవి దక్కడంలేదు. సర్పంచ్ పదవి కోసం ఆత్రుతగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు.. తొందరపాటులో అసలు విషయం మరిచిపోవడంతో ఫలితం మాత్రం దక్కలేదు. 

కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఓ గ్రామంలో సర్పంచి స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామానికి చెందిన యువకుడు ఒకరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎస్సీ మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రిజర్వేషన్ తో సర్పంచ్ పదవి దక్కించుకోవాలని హడావుడిగా ఈ నెల 26న ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు.

అయితే, ఆమె పేరును గ్రామంలోని ఓటరు జాబితాలో చేర్చే విషయంలో ఆలస్యం జరిగింది. ఇంతలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నోటిఫికేషన్ వెలువడటంతో ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు గడువు ముగిసింది. ఫలితంగా, అతని భార్య పేరు ఓటరు జాబితాలో నమోదు కాలేదు. నామినేషన్ వేయడానికి ఆమెకు అర్హత లేకుండా పోయింది. సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ యువకుడి కల నెరవేరలేదు.


More Telugu News