సత్యసాయి జిల్లాలో దారుణం.. నాలుగేళ్ల బాలుడిని హత్య చేసిన మేనత్త భర్త

  • శ్రీ సత్యసాయి జిల్లాలో నాలుగేళ్ల బాలుడి దారుణ హత్య
  • మేనత్త భర్తే నిందితుడని తేల్చిన పోలీసులు
  • వైద్యానికి డబ్బులివ్వలేదనే కక్షతో ఘాతుకం
బంధుత్వానికే మచ్చ తెచ్చే దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. వైద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు ఓ కిరాతకుడు. నాలుగేళ్ల మేనల్లుడిని కిడ్నాప్ చేసి, కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన ఎన్.పి. కుంట మండలం గౌకనపేటలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. గౌకనపేటకు చెందిన గంగాధర్ కుమారుడు హర్షవర్ధన్ (4) బుధవారం ఉదయం అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, గురువారం ఉదయం గ్రామ సమీపంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడిని మేనత్త భర్త ప్రసాద్ హత్య చేసినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి నిర్ధరించారు.
 
నిందితుడు ప్రసాద్ కుమారుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తన కుమారుడి వైద్య ఖర్చుల కోసం బావమరిది గంగాధర్‌ను డబ్బులు అడిగాడు. అతను ఇవ్వలేదన్న కోపంతో, గంగాధర్‌పై కక్ష పెంచుకున్న ప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్ఐ నరసింహుడు తెలిపారు. బుధవారం ఉదయం హర్షవర్ధన్‌ను అపహరించి, హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  


More Telugu News