డెంగీకి సింగిల్ డోస్ వ్యాక్సిన్.. ప్రపంచంలోనే తొలిసారి!

  • బ్రెజిల్‌లో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్
  • తీవ్రమైన డెంగ్యూపై 91.6 శాతం సమర్థత చూపిన టీకా
  • వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డెంగీ కేసులు
డెంగీ నివారణలో ప్రపంచం ఒక చారిత్రక ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి సింగిల్ డోస్ డెంగీ వ్యాక్సిన్‌కు బ్రెజిల్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

సావో పాలోలోని ప్రఖ్యాత బుటాంటన్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన 'బుటాంటన్-డీవీ' అనే ఈ వ్యాక్సిన్‌ను 12 నుంచి 59 ఏళ్ల వయసు వారికి అందించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డెంగీ వ్యాక్సిన్‌ను మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉండగా, ఈ కొత్త వ్యాక్సిన్ ఒక్క డోసుతోనే సరిపోతుంది. ఇది వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా, సులభంగా మార్చనుంది.

"బ్రెజిల్ సైన్స్, ఆరోగ్య రంగాలకు ఇది ఒక చారిత్రక విజయం. దశాబ్దాలుగా మనల్ని పీడిస్తున్న వ్యాధిపై పోరాటానికి ఇది ఒక శక్తిమంతమైన ఆయుధం" అని బుటాంటన్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఎస్పర్ కల్లాస్ మీడియా సమావేశంలో తెలిపారు. బ్రెజిల్‌లో 16,000 మంది వలంటీర్లపై ఎనిమిదేళ్ల పాటు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ తీవ్రమైన డెంగీపై 91.6 శాతం సమర్థత చూపింది.

మనిషిని కుదురు లేకుండా చేసే ఈ వ్యాధి లక్షణాల కారణంగా 'బ్రేక్‌బోన్ ఫీవర్' అని కూడా డెంగీని పిలుస్తారు. ఇది కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావానికి కారణమై ప్రాణాంతకంగా కూడా మారుతుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 1.46 కోట్ల కేసులు, 12,000 మరణాలు నమోదయ్యాయని, వీటిలో సగం మరణాలు బ్రెజిల్‌లోనే సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. 2026 ద్వితీయార్థంలో సుమారు 30 మిలియన్ల డోసుల వ్యాక్సిన్‌ను అందించేందుకు చైనాకు చెందిన వుసీ బయోలాజిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రి తెలిపారు.


More Telugu News