'నీ రేటెంత?' అని అడుగుతున్నారు: సోషల్ మీడియా వేధింపులపై నటి గిరిజా ఓక్ ఆవేదన

  • సోషల్ మీడియా వేధింపులపై మరాఠీ నటి గిరిజా ఓక్ ఆవేదన
  • 'నీ రేటెంత' అంటూ అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయన్న గిరిజ 
  • నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన
  • వైరల్ క్లిప్‌తో పాప్యులారిటీ పెరిగినా అవకాశాలు రాలేదని వ్యాఖ్యలు
ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఇటీవల అధికమయ్యాయి. దీని కారణంగా వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరాఠీ నటి గిరిజా ఓక్ తనకు ఎదురవుతున్న చేదు అనుభవాలను పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరాఠీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన గిరిజా ఓక్, ఇటీవల ఒక చిన్న వీడియో క్లిప్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. దీంతో ఆమెను అనుసరించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అయితే, ఈ పాప్యులారిటీ సినిమా అవకాశాలు తీసుకురాకపోగా, తీవ్రమైన వేధింపులను తెచ్చిపెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చిన పాప్యులారిటీ వల్ల జీవితంలో పెద్దగా మార్పు రాలేదని, కానీ అసభ్యకరమైన కామెంట్లు, మెసేజ్‌లు మాత్రం విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. "నీ రేటు ఎంత?", "ఒక గంటకు ఎంత తీసుకుంటావు?" లాంటి నీచమైన సందేశాలు రోజూ వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆన్‌లైన్‌లో ఇలా ప్రవర్తించేవాళ్లే బయట కనిపిస్తే కనీసం కన్నెత్తి కూడా చూడరని, ఎంతో గౌరవంగా మాట్లాడతారని చెప్పారు. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని గిరిజ ఆవేదన చెందారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ వేధింపులపై మరోసారి చర్చకు దారితీశాయి. 


More Telugu News