గెలిచినప్పుడు పొగడలేదు, ఓడితే తిడతారా?.. గంభీర్‌ను వెనకేసుకొచ్చిన గవాస్కర్

  • దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి.. కోచ్ గంభీర్‌పై విమర్శలు
  • గంభీర్‌కు మద్దతుగా నిలిచిన భారత దిగ్గజం సునీల్ గవాస్కర్
  • మైదానంలో విఫలమైంది ఆటగాళ్లేనని స‌న్నీ స్ప‌ష్టీక‌ర‌ణ‌
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆయనకు అండగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోవడం, ముఖ్యంగా గువాహటిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో గంభీర్‌పై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరు అభిమానులు స్టేడియంలో "గౌతమ్ గంభీర్ హే హే" అంటూ హేళనగా నినాదాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో గవాస్కర్ స్పందిస్తూ ఓటమికి కేవలం కోచ్‌ను బాధ్యుడిని చేయడం అన్యాయమని అన్నాడు.

ఈ విషయంపై ఇండియా టుడేతో గవాస్కర్ మాట్లాడుతూ.. "కోచ్ జట్టును సిద్ధం చేయగలడు. తన అనుభవంతో ఆటగాళ్లకు సలహాలు ఇవ్వగలడు. కానీ, మైదానంలో రాణించాల్సింది ఆటగాళ్లే. గంభీర్‌ను బాధ్యుడిని చేయాలని అడుగుతున్న వారిని నేను ఒకటే ఎదురు ప్రశ్న అడుగుతున్నా. అతని కోచింగ్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడు మీరేం చేశారు?" అని ప్రశ్నించాడు.

"అప్పుడు గంభీర్‌కు జీవితకాల కాంట్రాక్ట్ ఇవ్వాలని అడిగారా? అడగలేదు కదా. జట్టు ఓడిపోయినప్పుడు మాత్రమే కోచ్‌ను తప్పుపట్టడం అలవాటుగా మారింది" అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మూడు ఫార్మాట్లకు కోచ్‌గా ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, గంభీర్‌ను కూడా అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా కొనసాగించడంలో తప్పులేదని అభిప్రాయపడ్డాడు.

"ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు మీరు అతనికి క్రెడిట్ ఇవ్వనప్పుడు, 22 గజాల పిచ్‌పై ఆటగాళ్లు విఫలమైతే అతడిని ఎందుకు నిందిస్తున్నారు? ఇది సరికాదు" అని గవాస్కర్ పేర్కొన్నారు.


More Telugu News