చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ .. ఫైబర్ నెట్ కేసు క్లోజ్

  • చంద్రబాబుకు క్లీన్‌చిట్
  • కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చిన సీఐడీ
  • కేసు మూసివేతకు అభ్యంతరం లేదన్న ఫైబర్‌నెట్ ఎండీలు
  • ఫిర్యాదు చేసిన మాజీ ఎండీనే కేసు మూసివేతకు అంగీకారం
ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా మరో 15 మందికి ఊరట లభించింది. ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, సంస్థకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని సీఐడీ స్పష్టం చేయడంతో కేసును అధికారికంగా మూసివేశారు. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు నివేదిక సమర్పించారు.

ఈ కేసుకు సంబంధించి ఫైబర్‌నెట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. మధుసూదన రెడ్డి, ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ నిన్న ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. సీఐడీ సమర్పించిన తుది నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని, కేసు మూసివేతకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు లిఖితపూర్వకంగా, మౌఖికంగా కోర్టుకు తెలియజేశారు.

గత వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసును నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. టెర్రాసాఫ్ట్ అనే సంస్థకు రూ.321 కోట్ల మేర ఆయాచితంగా లబ్ధి చేకూర్చారని 2021 సెప్టెంబరులో అప్పటి ఫైబర్‌నెట్ ఎండీ మధుసూదన రెడ్డే సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు, 2023 అక్టోబరులో ఈ కేసులో చంద్రబాబునాయుడు పేరును నిందితుడిగా చేర్చారు.

అయితే, కేంద్రం నుంచి భారత్ నెట్ పథకం కింద విడుదలైన నిధులను టెర్రాసాఫ్ట్‌కు బదలాయించినట్లు సీఐడీ తన దర్యాప్తులో నిర్ధారించలేకపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని సీఐడీ నివేదిక ఇవ్వడం, నాడు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇప్పుడు కేసు మూసివేతకు అంగీకరించడం గమనార్హం. 


More Telugu News