అయోధ్యలో మోదీ ధ్వజారోహణం.. పాకిస్థాన్ విమర్శలకు భారత్ గట్టి కౌంటర్

  • ధ్వజారోహణలో మోదీ పాల్గొనడంపై పాక్ విమర్శలు
  • మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీల పట్ల హింస చరిత్ర పాకిస్థాన్‌కు ఉందన్న భారత్
  • పాకిస్థాన్ తమ గురించి ఆలోచించుకుంటే మంచిదని సూచన
అయోధ్య రామమందిరం ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనడంపై పాకిస్థాన్ చేసిన విమర్శలను భారత్ ఖండించింది. మైనారిటీల పట్ల హింస, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విమర్శించారు.

పాకిస్థాన్ ఇతర దేశాల గురించి ఆలోచించకుండా తమ దేశంలోని సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించారు. పాకిస్థాన్ చేసిన విమర్శలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

మైనారిటీలను అణిచివేసే చరిత్ర కలిగిన దేశానికి ఇతరులకు ఉపదేశాలు ఇచ్చే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు. కపట ఉపన్యాసాలు ఇవ్వడానికి బదులు అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.

అయోధ్యలో భారీస్థాయిలో నిర్మించిన రామాలయం పనులు పూర్తయిన సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో నాణ్యమైన వస్త్రంతో తయారైన పతకాన్ని 161 అడుగుల ఆలయ శిఖరంపై ఎగురవేశారు.

అయితే, ఈ కాషాయ జెండాను మోదీ ఎగురవేయడంపై పాకిస్థాన్ విమర్శలు చేసింది. ఈ చర్య భారత్‌లో మైనారిటీ వర్గంపై ఒత్తిడి పెంచడానికి, ముస్లిం వారసత్వాన్ని తుడిచిపెట్టే చర్యగా అభివర్ణించింది. 16వ శతాబ్దపు బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించినట్లు పేర్కొంది.


More Telugu News