పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకువెళ్లడానికి ఒత్తిళ్లు వచ్చాయి: కేటీఆర్

  • తాను నమ్ముకున్న నాయకుడు కేసీఆరేనని రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారన్న కేటీఆర్
  • పల్లా రాజేశ్వర్ రెడ్డిది నిజమైన విధేయత అన్న కేటీఆర్
  • జనగామ ప్రజలు బీఆర్ఎస్‌కు పట్టం కడతారనే విశ్వాసం ఉందన్న కేటీఆర్
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్లడానికి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా, ఆయన మాత్రం తాను నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పల్లా రాజేశ్వర్ రెడ్డిది నిజమైన విధేయత, విశ్వాసమని కొనియాడారు. ఆయన విశ్వసనీయతకు నిదర్శనమని అన్నారు. రానున్న సర్పంచ్, భవిష్యత్తులో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో జనగామ జిల్లా ప్రజలు బీఆర్ఎస్‌కు పట్టం కడతారనే నమ్మకం తనకు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కొంతమంది నాయకులు పార్టీలు మారుతూ మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిజమైన బలం ఉంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో నిలబడాలని సవాల్ విసిరారు. పార్టీ మారిన వారు ఉప ఎన్నికలకు వెళితే వారి బలం ఏమిటో తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు.

2001 నుంచి 2023 వరకు జనగామ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నిక ఏదైనా సరే ప్రతి నాయకుడు, కార్యకర్త కథానాయకుడు కావాలని అన్నారు. వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


More Telugu News