అయ్యప్ప మాల వేసుకునే వారికి నిబంధనలు.. బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఆగ్రహం

  • మాల వేసుకుంటే ప్రభుత్వం 40 రోజులు సెలవులు ఇస్తుందా అని నిలదీత
  • ఇతర మతస్తుల పండుగలకు అలవెన్సులు ఇస్తారని ఆగ్రహం
  • హిందువుల పండుగలకే ఇలాంటి నిబంధనలు తెస్తారన్న చికోటి ప్రవీణ్
అయ్యప్ప మాల ధరించిన ఉద్యోగులు, ధరించాలనుకునే వారు సెలవులు పెట్టాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు సూచించడంపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ స్పందించారు. అయ్యప్ప మాల ధరించిన కంచన్‌బాగ్ ఎస్సైకి డీఎస్పీ మెమో జారీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవులు పెట్టి మాల ధరించాలని చెబుతున్నారని, మరి 40 రోజుల పాటు పోలీసులకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

మెమోలో గడ్డం పెంచవద్దని, సాధారణ దుస్తుల్లో విధులకు హాజరు కావొద్దని పేర్కొనడం ఏమిటని ఆయన నిలదీశారు. మాలధారణ అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని, దీనిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. ఇతర మతస్తుల పండుగలకు సెలవులు ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తూ, పని గంటలు తగ్గిస్తారని ఆయన అన్నారు. హిందువుల పండుగలకే ఇలాంటి నిబంధనలు ఎందుకు విధిస్తారని ఆయన ప్రశ్నించారు.

హిందువులు, అయ్యప్ప స్వాములు వీధుల్లోకి వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీసు శాఖలోనే ఇలాంటి పొరపాట్లు జరిగితే ఎలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే పోలీస్ శాఖ ఉందని, పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం లేదా అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో హిందూ వ్యతిరేకిగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు.


More Telugu News