భారతదేశంలో ఎక్కడా అభద్రతా భావం కలగలేదు: కెనడాలో తన కేఫ్‌పై కాల్పుల ఘటనపై కపిల్ శర్మ

  • తన కేఫ్‌పై కాల్పులు జరిగిన ప్రతిసారి మరింత ఆదరణ లభించిందని వెల్లడి
  • అక్కడి పరిస్థితులపై నాకు చాలా మంది ఫోన్ చేశారన్న కపిల్ శర్మ
  • ముంబై లాంటి నగరం మరొకటి లేదని వ్యాఖ్య
భారతదేశంలో తనకు ఎటువంటి అభద్రతా భావం లేదని బాలీవుడ్ కమెడియన్, హోస్ట్ కపిల్ శర్మ స్పష్టం చేశారు. కెనడాలోని కపిల్ శర్మకు చెందిన కేఫ్‌పై కొన్ని నెలల వ్యవధిలోనే పలుమార్లు కాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ కాల్పుల ఘటనల అనంతరం తన కేఫ్‌కు మరింత మంది అతిథులు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ కాల్పుల నేపథ్యంలో కెనడా అధికారులు సైతం ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు.

స్థానిక నిబంధనల కారణంగా అక్కడి పోలీసులకు ఇటువంటి ఘటనలను నియంత్రించే అధికారం లేకపోవచ్చని, అయితే తన కేఫ్‌పై కాల్పుల వ్యవహారం కెనడా ప్రభుత్వం దృష్టికి వెళ్లిందని ఆయన అన్నారు. అంతేకాకుండా, అక్కడి పార్లమెంటులో సైతం దీనిపై చర్చ జరిగినట్లు తెలిపారు. వాస్తవానికి ప్రతి కాల్పుల ఘటన తర్వాత తన కేఫ్‌కు మరింత ఆదరణ లభించిందని ఆయన వెల్లడించారు. అక్కడి పరిస్థితులపై చాలామంది తనకు ఫోన్లు చేశారని, ముంబై వంటి నగరం మరొకటి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో కపిల్ శర్మ కేఫ్‌ను ప్రారంభించారు. ఈ ఏడాది జులైలో తొలిసారి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని, ఆ తర్వాత ఆగస్టు, అక్టోబర్ నెలల్లోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. కాల్పులకు తామే బాధ్యులమని కూడా ఎవరూ ప్రకటించలేదని ఆయన వెల్లడించారు.


More Telugu News