Erkala Bhimappa: రిజర్వేషన్‌తో జాక్‌పాట్.. తెలంగాణలో ఒకే కుటుంబానికి సర్పంచ్, రెండు వార్డు పదవులు!

Telangana Family Hits Jackpot with Reservation in Local Elections
  • వికారాబాద్ జిల్లాలో.. గ్రామంలో ఒకే కుటుంబానికి పంచాయతీ పగ్గాలు
  • ఎస్టీ రిజర్వేషన్‌తో మారిన భీమప్ప కుటుంబం తలరాత
  • గ్రామంలో ఒకే ఒక్క ఎస్టీ కుటుంబం ఉండటంతో కలిసొచ్చిన అదృష్టం
  • సర్పంచ్‌తో పాటు రెండు వార్డు సభ్యుల పదవులు కూడా వారివే
స్థానిక సంస్థల ఎన్నికలు ఓ నిరుపేద కుటుంబానికి ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. రిజర్వేషన్ల పుణ్యమా అని ఒకే కుటుంబానికి సర్పంచ్‌తో పాటు రెండు వార్డు మెంబర్ల పదవులు దక్కనున్న ఆసక్తికర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ పరిణామం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్ మండలం మతన్‌గౌడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని ఈసారి ఎస్టీ అభ్యర్థికి రిజర్వ్ చేశారు. అయితే, 494 మంది ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో ఎరుకల భీమప్ప కుటుంబం మాత్రమే ఏకైక ఎస్టీ కుటుంబం. దీంతో సర్పంచ్ పదవి భీమప్ప కుటుంబానికే దక్కడం ఖాయమైంది. గ్రామంలో చీపుర్లు, బుట్టలు అల్లుకుంటూ భార్య వెంకటమ్మతో కలిసి భీమప్ప జీవనం సాగిస్తున్నారు.

కేవలం సర్పంచ్ పదవే కాకుండా, ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసిన రెండు వార్డు స్థానాలు కూడా వీరి కుటుంబానికే దక్కనున్నాయి. భీమప్పకు ఇద్దరు కుమారులు ఎల్లప్ప, మహేశ్, కోడళ్లు సప్న, సుజాత ఉన్నారు. కుమారులు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

గ్రామంలో వేరే ఎస్టీ కుటుంబం లేకపోవడంతో ఈ మూడు పదవులు ఏకగ్రీవంగా భీమప్ప కుటుంబానికే దక్కనున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను పూర్తిగా మార్చేస్తాయని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఊహించని విధంగా వచ్చిన ఈ రాజకీయ అవకాశం వారి జీవితంలో కొత్త వెలుగులు నింపబోతోంది.
Erkala Bhimappa
Telangana elections
Vikarabad district
MatanGoud village
ST reservation
Sarpanch post
Ward member
Local body elections
Poverty alleviation
Family wins multiple posts

More Telugu News