KTR: 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, 17 శాతానికి తగ్గించారు: కేటీఆర్

KTR Criticizes Reduction of BC Reservations in Telangana
  • రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్
  • కులగణన ఆదర్శమని రాహుల్ గాంధీ చెప్పారు కానీ ఉన్న రిజర్వేషన్లు తగ్గించారని వ్యాఖ్య
  • హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆరోపణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఉన్న 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ అన్నారని, కానీ ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా తగ్గించారని విమర్శించారు.

కేటీఆర్ ఈరోజు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్ జిల్లా అంటేనే పత్తి పంటకు, అజంజాహీ మిల్లుకు పేరుగాంచిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లా పూర్వవైభవం కోల్పోయిందని అన్నారు. అలాంటి వరంగల్ జిల్లాలో కేసీఆర్ అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేశారని తెలిపారు. వరంగల్‌కు మళ్లీ టెక్స్‌టైల్ హబ్ గుర్తింపు తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను విక్రయించి, రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎంగా చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

హైదరాబాద్ నగరం లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలను, ఫార్మా పరిశ్రమను తరలించడానికి ఫార్మా సిటీని తమ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
KTR
KTR BRS
Telangana politics
Rahul Gandhi
BC reservations
Warangal

More Telugu News