శంకరగుప్తం డ్రెయిన్‌పై పవన్ దృష్టి.. అధికారులకు సున్నిత హెచ్చరిక

  • కేశనపల్లి కొబ్బరి రైతులతో పవన్ ముఖాముఖి
  • కోనసీమ కొబ్బరి రైతుల గొంతుకనవుతానని వ్యాఖ్య
  • సంక్రాంతి తర్వాత డ్రెయిన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ 
కోనసీమ కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని, వారి గొంతుకనవుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఈరోజు కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన, శంకరగుప్తం డ్రెయిన్‌ కారణంగా నష్టపోయిన కేశనపల్లి కొబ్బరి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ఓపికగా విన్నారు.

కేవలం రూ.22 కోట్ల నిధులు ఇచ్చి హడావుడి చేసేందుకు తాను రాలేదని, సమస్యను మూలాల నుంచి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పవన్ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమ వ్యాప్తంగా ఉన్న డ్రెయిన్ల సమస్యపై పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. "గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాం. అబద్ధపు మాటలు చెబితే యువత నమ్మరు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా శంకరగుప్తం డ్రెయిన్‌ సమస్యపై అధికారుల తీరును పవన్ కల్యాణ్ సున్నితంగా తప్పుబట్టారు. డ్రెయిన్‌ ఆక్రమణలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. గతంలో ఇరిగేషన్‌ నిపుణుడు రోశయ్య కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. రైతుల సమస్యలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. 


More Telugu News