వాకింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. వైరల్ వీడియో ఇదిగో!

  • సాయంత్రం వాకింగ్ చేస్తున్న శివసేన మాజీ ఎమ్మెల్యే నిర్మలా గావిత్‌ను ఢీకొట్టిన కారు
  • వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్
  • తీవ్రగాయాలతో ఐసీయూలో చికిత్స.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడి
  • ఘటన జరిగి 24 గంటలు దాటినా దొరకని డ్రైవర్
  • ఇది ప్రమాదం కాదని, కుట్ర జరిగిందని కుటుంబ సభ్యుల అనుమానం
మహారాష్ట్రలోని నాసిక్‌లో శివసేన మాజీ ఎమ్మెల్యే నిర్మలా గావిత్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. సాయంత్రం తన ఇంటి సమీపంలో మనవడితో కలిసి వాకింగ్ చేస్తున్న ఆమెను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో వున్నారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న నిర్మలా గావిత్‌ను వెనుక నుంచి వచ్చిన కారు ఎలాంటి హెచ్చరిక లేకుండా ఢీకొట్టింది. ఆ కారు ఢీకొట్టిన వేగానికి ఆమె గాల్లోకి ఎగిరి చాలా దూరం పడిపోయారు. ఆమెతో పాటు ఉన్న మనవడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియో స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ ఘటన జరిగి 24 గంటలు గడిచినా డ్రైవర్ ఇంకా పరారీలోనే ఉండటంపై నిర్మలా గావిత్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏబీపీ మఝా కథనం ప్రకారం.. ఆమె కుమార్తె నాయనా గావిత్ మాట్లాడుతూ "నాసిక్ పోలీసులు ఏం చేస్తున్నారు? కఠినమైన నిఘా ఉండే నగరంలో డ్రైవర్ ఇంకా ఎలా దొరకలేదు?" అని ప్రశ్నించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్రపూరితంగా చేసినదా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో నాసిక్ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినప్పటికీ, డ్రైవర్ ఆచూకీ లభించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, నిర్మలా గావిత్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. 2014లో ఇగత్‌పురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని వీడి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.


More Telugu News