గ్రేటర్ హైదరాబాద్‌లో కరెంట్ వైర్లకు గుడ్ బై.. ఇకన్నీ భూగర్భ కేబుళ్లే!

  • భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
  • రూ.14,725 కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టుకు అంచనా
  • 27,063 కిలోమీటర్ల మేర ఓవర్‌హెడ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లు
  • రోడ్లు తవ్వకుండానే హారిజాంటల్ డ్రిల్లింగ్ విధానంలో పనులు
  • దశలవారీగా ప్రాజెక్టును చేపట్టనున్న దక్షిణ తెలంగాణ డిస్కం
గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చేసే బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగరంలో ప్రస్తుతం ఉన్న ఓవర్‌హెడ్ విద్యుత్ తీగల స్థానంలో పూర్తిస్థాయిలో భూగర్భ కేబుల్ (యూజీ) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రాథమికంగా రూ.14,725 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.

ఈ నిర్ణయంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్‌పీడీసీఎల్) పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ పరిధిలోని 27,063 కిలోమీటర్ల పొడవైన 11 కేవీ ఓవర్‌హెడ్ లైన్లను దశలవారీగా భూగర్భంలోకి మార్చనున్నారు. మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధిలోని 10 విద్యుత్ సర్కిళ్లలో ఈ పనులను చేపట్టనున్నారు. ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇప్పటికే ఇంజనీర్ల బృందం కోల్‌కతా, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లోని యూజీ కేబుల్ వ్యవస్థల పనితీరును అధ్యయనం చేసింది.

క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఇంజనీర్లు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) కూడా సిద్ధం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. రోడ్లను తవ్వాల్సిన అవసరం లేకుండా 'హారిజాంటల్ డ్రిల్లింగ్' అనే ప్రత్యేక విధానం ద్వారా 2 నుంచి 3 మీటర్ల లోతులో కేబుళ్లను వేయనున్నారు. ఈ టెక్నాలజీతో తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేయవచ్చని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News