పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్ కు లక్ష టన్నుల బియ్యం

  • పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు ఇంత పెద్ద మొత్తంలో బియ్యం రవాణా ఇదే తొలిసారి
  • పాక్‌తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం
  • ఇటీవల జరిగిన ఒప్పందాలను అమలు చేసే దిశగా పాకిస్థాన్, బంగ్లాదేశ్
పాకిస్థాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు లక్ష టన్నుల బియ్యం ఎగుమతి చేయనుంది. ఇంత పెద్ద మొత్తంలో బియ్యం రవాణా చేయడం ఇదే మొదటిసారి. ఈ మేరకు గత వారమే టెండర్ జారీ అయింది. షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్‌... భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. అయితే, మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు పెంచుకుంటోంది.

ఇటీవల జరిగిన సదస్సుల్లో రెండు దేశాలు పలు అంశాలపై ఒప్పందాలు చేసుకున్నాయి. వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు దాదాపు రెండు లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందం కుదిరిందని సమాచారం. మొదటి దశలో 50 వేల టన్నుల బియ్యం బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది.

ఇటీవల ఢాకాలో జరిగిన సదస్సులో పాకిస్థాన్, బంగ్లాదేశ్ పలు ఒప్పందాలు చేసుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా తదితర రంగాల్లో పరస్పర సహకారానికి అంగీకరించాయి. వాణిజ్య విస్తరణ కోసం కరాచీ పోర్టు ట్రస్ట్‌ను వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తామని బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ హామీ ఇచ్చింది. టూరిజం, మెడికల్ ట్రావెల్ వృద్ధి కోసం నేరుగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాయి.


More Telugu News