టీ20 వరల్డ్ కప్-2026 బ్రాండ్ అంబాసిడర్ గా రోహిత్ శర్మ

  • భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో టీ20 వరల్డ్ కప్-2026
  • మెగా టోర్నీకి ప్రచారకర్తగా రోహిత్ శర్మ
  • ప్రకటించిన ఐసీసీ చైర్మన్ జై షా
టీమిండియా మాజీ కెప్టెన్, 2024 టీ20 ప్రపంచకప్ విజేత రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్‌కు టోర్నమెంట్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2024లో కెప్టెన్‌గా కప్ గెలిపించిన హిట్ మ్యాన్, ఇప్పుడు కొత్త హోదాలో ఈ మెగా టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు.

ఈ నియామకంపై ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. "భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మను టోర్నమెంట్ అంబాసిడర్‌గా ప్రకటించడం గౌరవంగా భావిస్తున్నాం. 2024 ప్రపంచకప్ విజేత కెప్టెన్, ఇప్పటివరకు జరిగిన తొమ్మిది ఎడిషన్లలోనూ ఆడిన రోహిత్ శర్మ కంటే ఈ ఈవెంట్‌కు మరో మంచి ప్రతినిధి ఉండరు" అని ఆయన పేర్కొన్నారు.

2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో యువ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్, 17 ఏళ్ల తర్వాత 2024లో కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించి కప్ అందించారు. ఆ టోర్నీలో పవర్‌ప్లేలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియాపై 41 బంతుల్లో 92 పరుగులు, సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై కీలక అర్ధశతకం సాధించాడు. ప్రపంచకప్ గెలిచిన వెంటనే హిట్ మ్యాన్ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ఈ కొత్త బాధ్యతపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. "ఈ టోర్నమెంట్ మళ్లీ భారత్‌లో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి బ్రాండ్ అంబాసిడర్‌గా కొత్త హోదాలో టోర్నీతో అనుబంధం ఏర్పరచుకోవడం గొప్ప విషయం. ఆటగాళ్లందరికీ నా శుభాకాంక్షలు. వారు భారత ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ మంచి జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నాను" అని రోహిత్ తెలిపాడు.


More Telugu News