ఢిల్లీలో వాయు కాలుష్యం.. రంగంలోకి దిగిన ప్రధానమంత్రి కార్యాలయం

  • ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
  • కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • విద్యుత్ వాహనాలను విస్తృతపరిచే చర్యలు ముమ్మరం చేయాలని సూచన
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకరంగా పడిపోతున్న నేపథ్యంలో పీఎంవో రంగంలోకి దిగింది. కాలుష్యానికి కారకమయ్యే వాహనాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాలుష్య నివారణలో భాగంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు చర్యలు ముమ్మరం చేయాలని సూచించింది.

ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఢిల్లీలోని వాయు నాణ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో వాహనాల కాలుష్యం ప్రధానాంశంగా ప్రస్తావనకు వచ్చింది. దేశ రాజధానిలో ఇంకా 37 శాతం మేర పాత వాహనాలు వినియోగంలో ఉన్నట్లు సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

వాటి స్థానంలో ఈవీ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈవీ వాహనాలకు రాయితీలు ఇవ్వడంతో పాటు ఛార్జింగ్ స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. కాలుష్య కారక పెట్రోల్, డీజిల్ వాహనాలు వినియోగాన్ని తగ్గించాలని అన్నారు.


More Telugu News