ఏపీలో కొత్తగా 3 జిల్లాలు... సీఎం చంద్రబాబు ఆమోదం

  • కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
  • రాష్ట్రంలో 29కి చేరనున్న మొత్తం జిల్లాల సంఖ్య
  • కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు, ఒక మండలానికి గ్రీన్ సిగ్నల్
  • మంత్రుల కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఆయన ఆమోదముద్ర వేశారు. మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపై రెండు రోజుల పాటు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, కొన్ని మార్పులతో ఈ ప్రతిపాదనలను అంగీకరించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి చేరనుంది.

కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పడనున్నాయి. పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ఉండనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలతో పాటు, రెవెన్యూ వ్యవస్థలోనూ కీలక మార్పులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సీఎం అంగీకరించారు.

కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవే:
* నక్కపల్లి (అనకాపల్లి జిల్లా)
* అద్దంకి (ప్రకాశం జిల్లా)
* పీలేరు (మదనపల్లె జిల్లా)
* బనగానపల్లె (నంద్యాల జిల్లా)
* మడకశిర (సత్యసాయి జిల్లా)

అదేవిధంగా, కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి, పెద్దహరివనాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రుల కమిటీ ఈ సిఫార్సులు చేసింది. త్వరలోనే ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించి, కార్యాలయాలు, అధికారుల నియామకంపై దృష్టి సారించనున్నారు.


More Telugu News