ఎఫ్‌ అండ్‌ వో గడువు ప్రభావం... నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • నవంబర్ సిరీస్ ఎక్స్‌పైరీతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
  • 313 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, 74 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఐటీ, మీడియా షేర్లలో అమ్మకాల ఒత్తిడి
  • రాణించిన రియల్టీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు
  • మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మాత్రం లాభాల్లోనే!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. నవంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్&వో) కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు రోజంతా ఒడిదొడుకులకు లోనయ్యాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 313.7 పాయింట్లు నష్టపోయి 84,587.01 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 74.7 పాయింట్లు క్షీణించి 25,884.8 వద్ద ముగిసింది. నిపుణుల అంచనా ప్రకారం, నిఫ్టీకి 26,000 స్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.

రంగాల వారీగా మిశ్రమ ప్రదర్శన నమోదైంది. నిఫ్టీ రియల్టీ సూచీ 1.62%, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 1.44% చొప్పున లాభపడ్డాయి. మరోవైపు, నిఫ్టీ ఐటీ 0.57%, నిఫ్టీ మీడియా 0.80% మేర నష్టపోయాయి. ప్రధాన సూచీలు నష్టపోయినప్పటికీ, బ్రాడర్ మార్కెట్లు సానుకూలంగా రాణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.36%, స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.19% చొప్పున లాభపడ్డాయి.

ఎక్స్‌పైరీకి సంబంధించిన ఒడిదొడుకులతో పాటు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తుండటం మార్కెట్లపై ప్రభావం చూపిందని విశ్లేషకులు తెలిపారు. సెన్సెక్స్‌లో ట్రెంట్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోగా, భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL), ఎస్‌బీఐ, టాటా స్టీల్ వంటివి లాభపడిన వాటిలో ఉన్నాయి.


More Telugu News