అతనంతే .. 'ఆంధ్రా కింగ్ తాలూకా'

  • రామ్ హీరోగా 'ఆంధ్రా కింగ్ తాలూకా'
  • ఆయన జోడి కట్టిన భాగ్యశ్రీ బోర్సే 
  • ఈ నెల 27వ తేదీన సినిమా విడుదల
  • అభిమానులలో పెరుగుతున్న అంచనాలు      
ఒకప్పుడు థియేటర్ కి మాస్ హీరో సినిమా వస్తుందంటే, పండుగ వచ్చినట్టుగానే ఉండేది. థియేటర్ల దగ్గర మాస్ హీరో కటౌట్ .. ఆ కటౌట్ కి నిలువెత్తు పూల దండలు .. పాలాభిషేకాలు .. డప్పులు .. టపాసులతో అభిమానులు సందడి చేసేవారు. థియేటర్ల దగ్గర జాతర జరుగుతున్న ఒక వాతావరణం ఉండేది. అలాంటి ఒక అభిమానిగా మాస్ లుక్ తో రామ్ నటించిన సినిమానే 'ఆంధ్రా కింగ్ తాలూకా'. తాను హీరోగారి తాలూకా అని గర్వంగా చెప్పుకునే వీరాభిమానిగా ఆయన కనిపించనున్నాడు. టైటిల్ తోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమాకి, మహేశ్ బాబు పి దర్శకత్వం వహించాడు.
 
కొంతకాలంగా రామ్ మాస్ కంటెంట్ విషయంలోగానీ .. ఎనర్జీ లెవెల్స్ విషయంలో గాని ఎంతమాత్రం తగ్గడం లేదు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల జోడీగా భాగ్యశ్రీ బోర్సే అలరించనుంది. 'కాంత' తరువాత పెద్దగా గ్యాప్ లేకుండా వస్తున్న సినిమా ఇది. రామ్ - భాగ్యశ్రీ జోడీ బాగుందనే ఒక టాక్, పోస్టర్స్ సమయంలోనే వచ్చింది. ఇక ట్రైలర్ .. సాంగ్స్ బయటికి వచ్చిన తరువాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారి ఈ సినిమా, ఈ నెల 27వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది.

రామ్ నుంచి సరైన హిట్ లేక చాలా కాలమైపోయింది. అందువలన ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, మరోసారి మాస్ కంటెంట్ తో బరిలోకి దిగుతున్నాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. అభిమానులు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. అందాల నాయికగా యూత్ లో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న భాగ్యశ్రీకి కూడా ఈ సినిమా సక్సెస్ కీలకమైనదేనని చెప్పాలి. ఆమె కూడా ఈ సినిమాపై తన కెరియర్ గ్రాఫ్ ను పెంచుతుందనే ఆశతో ఉంది. సినిమా నేపథ్యంలో నడిచే ఈ సినిమా, ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.



More Telugu News