ఎల్‌టీటీఈ మహిళకు భారత ఓటర్ ఐడీ.. ఈసీని అప్రమత్తం చేసిన ఈడీ!

  • ఎల్‌టీటీఈతో సంబంధాలున్న శ్రీలంక మహిళ అరెస్ట్
  • ఆమె వద్ద భారత ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ స్వాధీనం
  • టెర్రర్ ఫండింగ్ కోసం నిధులు పంపినట్టు ఆరోపణలు
  • ఓటర్ ఐడీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఈడీ లేఖ
నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్‌టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక మహిళ వద్ద భారత ఓటర్ ఐడీ ఉన్నట్టు తేలడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), భారత ఎన్నికల సంఘాన్ని (ఈసీ) అప్రమత్తం చేసింది. గుర్తింపు పత్రాల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరింది.

వివరాల్లోకి వెళితే.. మేరీ ఫ్రాన్సిస్కా అనే శ్రీలంక మహిళను 2022లో ఓ బ్యాంకు మోసం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అధికారులు ఆమె నుంచి భారత ఓటర్ ఐడీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇండియన్ పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఇంకా యాక్టివ్‌గా ఉండటంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

పోలీసుల దర్యాప్తులో ఆమె ఎల్‌టీటీఈకి చెందిన క్రియాశీలక సభ్యుల కోసం నిధులు బదిలీ చేసినట్టు తేలింది. దీంతో ఈ కేసు తీవ్రతను గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, దీనిని జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) బదిలీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.

తాజాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ 66(2) కింద ఈడీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఈ సమాచారాన్ని అందించింది. టెర్రర్ ఫండింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక పౌరురాలికి ఇన్ని భారత గుర్తింపు పత్రాలు ఎలా జారీ అయ్యాయన్న దానిపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.


More Telugu News