పెంపుడు కుక్క దాడిలో తెగిపడిన బాలుడి చెవి.. వీడియో ఇదిగో!

  • ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై పిట్ బుల్ దాడి
  • బాలుడి చెవిని కొరికిన శునకం.. శరీరంపైనా పలుచోట్ల గాయాలు
  • బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో శునకం యజమాని అరెస్టు
ఢిల్లీలోని ప్రేమ్ నగర్ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఆరేళ్ల బాలుడిపై పక్కింటి వాళ్లు పెంచుకుంటున్న శునకం దాడి చేసింది. తప్పించుకుని పరిగెత్తినా విడవకుండా వెంటపడింది. ఈ దాడిలో బాలుడి చెవి తెగి కింద పడింది. బాలుడి శరీరంపైనా పలుచోట్ల గాయాలయ్యాయి. చుట్టుపక్కల వాళ్లు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ సంఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలుడిపైకి కుక్క ఎగబడడం, పరిగెత్తుతున్న బాలుడిని కిందపడేయడం వీడియోలో కనిపిస్తోంది. బాలుడిపై దాడి చేసిన శునకం పిట్ బుల్ బ్రీడ్ కు చెందినది. వాస్తవానికి ఈ జాతి శునకాల పెంపకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ చాలామంది వీటిని పెంచుకుంటున్నారు. తాజా దాడిపై బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. శునకం యజమానిని అరెస్టు చేశారు. శునకం దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం రోహిణిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


More Telugu News