భారత్‌లోకి అక్రమ ప్రవేశం.. వీడియోలు తీస్తూ పట్టుబడ్డ చైనా వ్యక్తి

  • భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన చైనా పౌరుడి అరెస్ట్
  • ఇండో-నేపాల్ సరిహద్దులో వీడియో తీస్తుండగా పట్టుకున్న SSB దళాలు
  • నిందితుడి నుంచి పాకిస్థాన్, చైనా, నేపాల్ కరెన్సీ స్వాధీనం
ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఒక చైనా పౌరుడిని సహస్త్ర సీమా బల్ (SSB) దళాలు అరెస్ట్ చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని బహరైచ్ జిల్లా రూపైదియా సరిహద్దు వద్ద ఈ ఘటన జరిగింది. 49 ఏళ్ల లియూ కుంన్‌జింగ్‌ అనే ఈ వ్యక్తి, సరిహద్దు ప్రాంతాన్ని తన ఫోన్‌లో వీడియో తీస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

ఎస్‌ఎస్‌బీ 42వ బెటాలియన్ కమాండెంట్ గంగా సింగ్ ఉదావత్ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు లియూ వద్ద ఎలాంటి సరైన పత్రాలు లేవు. చైనాలోని హునన్ ప్రావిన్సుకు చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. అతని వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, పాకిస్థానీ, చైనీస్, నేపాలీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో భాగంగా అతని ఫోన్లను పరిశీలించగా, అనేక సున్నిత ప్రదేశాలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు తేలింది. నిందితుడి వద్ద ఇంగ్లీష్‌లో రాసి ఉన్న నేపాల్ మ్యాప్ కూడా లభించింది. అయితే, తనకు ఇంగ్లీష్ గానీ, హిందీ గానీ రాదని అతను చెప్పడంతో.. ఓ అనువాదకుడి సాయంతో అధికారులు అతడిని ప్రశ్నించారు. గతంలో ఇతను పాకిస్థాన్‌కు కూడా వెళ్లినట్లు, అందుకు సంబంధించిన వీసా అతని వద్ద ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అతని ప్రయాణ ఉద్దేశ్యంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News