బెట్టింగ్ యాప్స్‌తోనే రూ.100 కోట్లు సంపాదించిన ఐబొమ్మ రవి!

  • ఐబొమ్మ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి
  • 35 బ్యాంకు ఖాతాల్లో కీలక ఆధారాల స్వాధీనం
  • బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన రవి తరఫు న్యాయవాది
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ వెనుక తానొక్కడినే ఉన్నానని రవి చెప్పినప్పటికీ, పైరసీ ఆరోపణలను అంగీకరించలేదని సమాచారం. అయితే, బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ద్వారానే తనకు రూ.కోట్లలో ఆదాయం వచ్చిందని అంగీకరించినట్లు తెలిసింది.

పోలీసుల దర్యాప్తు ప్రకారం రవి సుమారు 15 బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశాడు. ముఖ్యంగా 1ఎక్స్‌బెట్‌ ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. ఐబొమ్మ ప్రారంభమైనప్పటి నుంచి చెల్లింపులన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలోనే జరిగినట్లు గుర్తించారు. ఈ మార్గంలో రవి సుమారు రూ.80 నుంచి 100 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటివరకు 35 బ్యాంకు ఖాతాలను గుర్తించగా, వాటి ద్వారా రూ.30 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించాయి.

సినిమాల కొనుగోలు, యాడ్ ఏజెన్సీలతో ఒప్పందాల వంటి వ్యవహారాలన్నీ టెలిగ్రామ్ యాప్ ద్వారానే నడిపినట్లు ఆధారాలు సేకరించారు. తన స్నేహితుడు నిఖిల్, సోదరి ఖాతాలకు మాత్రమే రవి డబ్బు బదిలీ చేసినట్లు గుర్తించారు. కస్టడీ ముగియడంతో రవిని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు, రవి తరఫు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.


More Telugu News