మావోయిస్టుల పోలీసు కస్టడీకి కోర్టులో వేర్వేరు పిటిషన్లు

  • ప్రసాదంపాడులో పట్టుబడిన నలుగురి కోసం ఏడు రోజుల కస్టడీకి విజ్ఞప్తి
  • కానూరులో పట్టుబడిన ముగ్గురిని మూడు రోజులు కస్టడీకి కోరిన పోలీసులు
  • ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులు
విజయవాడ నగర శివార్లలో ఇటీవల వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసిన మావోయిస్టులను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు వారిని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు నిన్న రెండు వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.
 
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఈ నెల 18న నలుగురు మావోయిస్టులు పొడియా బీమా (రంగు), మడకం లక్మ (మదన్), మడవి చిన్మయి (మనీలా), మంగి డొక్కుపాడిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న వీరిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పటమట పోలీసులు నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు.
 
అదేవిధంగా, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌లో పట్టుబడిన 28 మంది మావోయిస్టుల్లో ముగ్గురిని కస్టడీకి కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దే రఘు, ఓయం జ్యోతి, మడకం దివాకర్‌లను మూడు రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ పటమట పోలీసులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై న్యాయస్థానాల నిర్ణయం వెలువడాల్సి ఉంది.


More Telugu News