గోవాలో ఫిడే వరల్డ్ కప్‌కు ప్రత్యేక అతిథిగా షూటింగ్ దిగ్గజం

  • గోవాలో జరుగుతున్న ఫిడే వరల్డ్ కప్ ఫైనల్స్‌కు హాజరైన అభినవ్ బింద్రా
  • ఫైనల్ తొలి గేమ్ ప్రారంభ సూచికగా మొదటి ఎత్తు వేసిన ఒలింపిక్ ఛాంపియన్
  • చెస్ క్రీడాకారులకు భవిష్యత్తులో మద్దతు ఇస్తానని వెల్లడి
భారత తొలి వ్యక్తిగత ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రా చెస్ క్రీడలో ప్రత్యేక అతిథిగా మెరిశారు. గోవాలో నిన్న ప్రారంభమైన ఫిడే వరల్డ్ కప్ 2025 ఫైనల్స్‌లో ఆయన పాల్గొన్నారు. చైనా గ్రాండ్‌మాస్టర్ వీ యి, ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ మధ్య జరిగిన ఫైనల్ తొలి గేమ్‌లో బింద్రా లాంఛనంగా మొదటి ఎత్తు వేసి ఆటను ప్రారంభించారు.

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి, భారత క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన 43 ఏళ్ల బింద్రా ఉన్నతస్థాయి చెస్ పోటీలను వీక్షించేందుకు గోవాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఫిడే అధికారితో సరదాగా రెండు గేమ్స్ ఆడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 23 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో వరల్డ్ కప్ జరగడం సంతోషంగా ఉందన్నారు.

‘చెస్ కేవలం కూర్చుని ఆడే ఆట కాదు. దీనికి అద్భుతమైన శారీరక, మానసిక సంసిద్ధత, క్రమశిక్షణ అవసరం. చెస్ క్రీడాకారులకు భవిష్యత్తులో నా వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆసక్తి ఉన్న బ్రాండ్లు ముందుకు వస్తే వారితో కలిసి పనిచేస్తాను’ అని బింద్రా తెలిపారు. 2016లో రిటైర్మెంట్ ప్రకటించినా, తన ఫౌండేషన్ ద్వారా ఆయన యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఫైనల్ తొలి గేమ్‌లో, నల్లపావులతో ఆడిన చైనా జీఎం వీ యి, ఉజ్బెకిస్థాన్ క్రీడాకారుడు జవోఖిర్ సిందరోవ్‌తో గేమ్‌ను డ్రాగా ముగించారు. మరోవైపు, మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జీఎం ఆండ్రీ ఎసిపెంకో, జీఎం నోదిర్‌బెక్ యాకుబ్బోవ్‌పై విజయం సాధించారు. 


More Telugu News