బెంగళూరులో అన్నమయ్య జిల్లా యువతి దారుణ హత్య.. స్నేహితుడి ఘాతుకం!

  • బీబీఏ విద్యార్థిని దేవశ్రీని తలపై మోది చంపిన నిందితుడు
  • స్నేహితుడు ప్రేమ్ వర్ధనే హంతకుడని పోలీసుల అనుమానం
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
కర్ణాటక రాజధాని బెంగళూరులో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం, బిక్కంగారిపల్లికి చెందిన దేవశ్రీ (21) అనే విద్యార్థినిని నిందితుడు అత్యంత కిరాత‌కంగా చంపేశాడు. ఉన్నత చదువులతో ఉజ్వల భవిష్యత్తును ఊహించుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.

వివరాల్లోకి వెళితే.. రెడ్డెప్ప, జ‌గ‌దాంబ దంప‌తుల కుమార్తె అయిన దేవశ్రీ బెంగళూరులోని ఆచార్య కళాశాలలో బీబీఏ నాలుగో సంవత్సరం చదువుతోంది. చదువు నిమిత్తం అక్కడే ఓ అద్దె గదిలో నివసిస్తోంది. ఆమెకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన ప్రేమ్ వర్ధన్ అనే యువకుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

దేవశ్రీ తలపై బలంగా మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. మదనాయ‌నకహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రేమ్ వర్ధన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి వస్తుందనుకున్న కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు ఇరుగుపొరుగు వారి హృదయాలను కలచివేస్తున్నాయి.


More Telugu News