వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు... సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అభినందనలు

  • వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన మన అమ్మాయిలు
  • ఫైనల్లో చైనీస్ తైపీపై 35-28 తేడాతో ఘనవిజయం
  • భారత మహిళల కబడ్డీ జట్టుపై ప్రశంసల వెల్లువ
భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ ఫైనల్లో చైనీస్ తైపీ జట్టును ఓడించి వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో 35-28 పాయింట్ల తేడాతో భారత జట్టు అద్భుత విజయం సాధించింది.

ఈ చారిత్రక విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుకు అభినందనలు తెలిపారు. 

"భారత్ మరోసారి ప్రపంచకప్ విజయాన్ని సొంతం చేసుకుంది. మన ఆడబిడ్డల సత్తా, పట్టుదల ఈ గెలుపునకు నాయకత్వం వహించాయి. ఢాకాలో జరిగిన ఫైనల్స్‌లో చైనీస్ తైపీపై 35–28 తేడాతో విజయం సాధించి, వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలుచుకున్న భారత మహిళల కబడ్డీ జట్టుకు నా అభినందనలు. ఇది దేశం గర్వించదగ్గ క్షణం" అని చంద్రబాబు పేర్కొన్నారు.

"మన మహిళల కబడ్డీ జట్టు వరుసగా రెండోసారి మహిళా కబడ్డీ ప్రపంచకప్‌ను గెలవడం భారతదేశానికి ఎంతో గర్వకారణమైన క్షణం. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో చైనీస్ తైపీని 35–28 తేడాతో ఓడించారు. వరుసగా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలవడం వారి అచంచలమైన క్రమశిక్షణ, పట్టుదల, అద్భుతమైన ప్రతిభకు నిదర్శనం. ప్రపంచ వేదికపై మరోసారి భారతదేశ ప్రతిష్టను ఉన్నత స్థాయికి చేర్చిన మన క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.


More Telugu News