ఆమె నవ్వు మధురమైన మంత్రం అంటున్న కుర్రకార్!

  • తెలుగు తెరపైకి మరో తెలుగమ్మాయి 
  • హీరోయిన్ గా 'రాజు వెడ్స్ రాంబాయి'తో ఎంట్రీ
  • హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 
  • యూత్ మనసులు దోచుకున్న బ్యూటీ
  • ఆమె నవ్వు ప్రత్యేక ఆకర్షణ అంటున్న ఫ్యాన్స్  
 
అందాన్ని నిర్వచించడం కష్టం .. నిదర్శనాలు చూపించడం కష్టం. ఎవరి అందం వారిది .. ప్రతి అందం వెనుక ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. వెండితెరపై వెలిగిపోయిన కథానాయికలను తీసుకుంటే, కలువల్లాంటి కళ్లతో కొందరు, మధురమైన దరహాసంతో మరికొందరు మంత్రముగ్ధులను చేయడం కనిపిస్తుంది. అటు విశాలమైన కళ్లతో విన్యాసాలు చేయడంలోను, ఇటు మధురమైన నవ్వుతో మనసులు కొల్లగొట్టడంలోను ఇప్పుడు ఒక అమ్మాయి యూత్ కి కునుకు లేకుండా .. కుదురు లేకుండా చేస్తోంది. సొట్ట బుగ్గలతో యూత్ హృదయాలను హోల్ సేల్ గా దోచేస్తున్న ఆ బ్యూటీ పేరే తేజస్వీ రావు. 

రీసెంటుగా విడుదలైన 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలో తేజస్వీనే కథానాయిక. ఈ సినిమా మంచి బజ్ తో బరిలోకి దిగడానికి కారణం ఈ సుందరినే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తేజస్వీ అంటేనే అసలైన అందం .. అచ్చమైన తెలుగుదనం అనేస్తున్నారు కుర్రాళ్లు. ఆమె అభిమానుల జాబితాలో చేరిపోవడానికి వాళ్లు ఎంతమాత్రం ఆలస్యం చేయడం లేదు. కథానాయికగా మొదటి సినిమాకే ఈ స్థాయి క్రేజ్ ను సొంతం చేసుకున్న తేజస్వీ, మున్ముందు మరింత జోరు చూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
    
గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లుగా అంజలి .. ఆనంది .. స్వాతిరెడ్డి .. ఈషా రెబ్బా .. వైష్ణవీ చైతన్య .. 'కోర్ట్' శ్రీదేవి కనిపిస్తారు. మొదటి ముగ్గురు కూడా టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లో ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. 'బేబీ' సినిమాతో వైష్ణవీ చైతన్య  ఒక ఊపు ఊపేస్తే, 'కోర్ట్' సినిమాతో శ్రీదేవి ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల నుంచి తేజస్వీ రంగంలోకి దిగింది. తెలంగాణ పిల్ల పాత్రలో, గుండె గోడలపై తన పోస్టర్లు వేసేసింది. చూస్తుంటే ఈ అందాల చందమామ హవా కొనసాగేలానే కనిపిస్తోంది మరి!



More Telugu News