జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... జీహెచ్ఎంసీ కార్పొరేటర్లపై కేటీఆర్ ప్రశంసలు

  • ఉప ఎన్నిక సమయంలో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారని కితాబు
  • పార్టీ వెంట ఉన్న ప్రతి కార్పొరేటర్‌కు భవిష్యత్తులో పదవులు వస్తాయని భరోసా
  • కౌన్సిల్ సమావేశంలో భూముల అమ్మకంపై నిలదీయాలని సూచన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో కార్పొరేటర్లు పోరాడిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. బల్దియా సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పార్టీ వెంట ఉన్న ప్రతి కార్పొరేటర్‌కు భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని అన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఎలాంటి అవినీతికి తావులేకుండా పనిచేశారని, కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతంగా సేవలందించారని ప్రశంసించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారని అభినందించారు.

పరిశ్రమలకు కేటాయించిన వాటితో పాటు హైదరాబాద్‌లో భూముల అమ్మకంపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నిలదీయాలని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం వైఫల్యంపై నిలదీయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ అందరినీ గెలిపించుకుంటుందని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు.


More Telugu News