షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో అరుణాచల్ మహిళకు చైనా వేధింపులు.. 18 గంటల నరకం

  • అరుణాచల్ చైనాలో భాగమంటూ పాస్‌పోర్ట్‌ను అడ్డుకున్న అధికారులు
  • 18 గంటల పాటు నిర్బంధించి, జపాన్ విమానం ఎక్కకుండా అడ్డుకున్న వైనం
  • భారత కాన్సులేట్ జోక్యంతో చివరకు ప్రయాణానికి అనుమతి
  • ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి బాధితురాలి విజ్ఞప్తి
చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ భారతీయ మహిళను షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు నిర్బంధించి తీవ్రంగా వేధించింది. ఆమె పాస్‌పోర్ట్‌పై, పుట్టిన ప్రదేశంగా అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటమే ఇందుకు కారణం. ఆ రాష్ట్రం తమ భూభాగమని వాదిస్తూ, ఆమె భారత పాస్‌పోర్ట్ చెల్లదని చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు దురుసుగా ప్రవర్తించారు.

వివరాల్లోకి వెళితే.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పేమా వాంగ్ థోంగ్‌డోక్ అనే మహిళ ఈ నెల‌ 21న లండన్ నుంచి జపాన్ వెళ్లేందుకు షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో విమానం మారాల్సి వచ్చింది. అయితే, ఆమె పాస్‌పోర్ట్‌ను పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, పుట్టిన ప్రదేశంగా అరుణాచల్ ప్రదేశ్ ఉండటంతో ఆమెను అడ్డుకున్నారు. "అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం, కాబట్టి మీ భారత పాస్‌పోర్ట్ చెల్లదు" అని వాదించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ సందర్భంగా చైనా అధికారులు, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనను ఎగతాళి చేశారని, "చైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని" హేళనగా మాట్లాడారని బాధితురాలు 'ఎక్స్‌' \వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 18 గంటల పాటు ఆహారం, ఇతర సౌకర్యాలు నిరాకరించి, జపాన్ వెళ్లాల్సిన విమానాన్ని కూడా ఎక్కనివ్వలేదని ఆమె తెలిపారు. చివరికి యూకేలోని తన స్నేహితురాలి ద్వారా షాంఘైలోని భారత కాన్సులేట్‌ను సంప్రదించడంతో వారి జోక్యం తర్వాత ఆమెను విడిచిపెట్టారు.

ఈ ఘటన భారత సార్వభౌమత్వానికి జరిగిన అవమానమని, దీనిపై చైనాను నిలదీయాలని ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకొని, తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని కోరారు. అరుణాచల్ ప్రదేశ్‌ విషయంలో చైనా వాదనలను భారత్ ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమని, ఎప్పటికీ అలాగే ఉంటుందని భారత విదేశాంగ శాఖ పలుమార్లు స్పష్టం చేసింది.


More Telugu News