పుచ్చ లేచిపోద్ది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్

  • నిరంజన్ రెడ్డికి మూడు ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని కవిత ఆరోపణ
  • ఆయన అవినీతి కేసీఆర్‌కు తెలియదా అని సూటి ప్రశ్న
  • హరీశ్ వల్లే నిరంజన్‌పై కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదన్న కవిత
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఉద్దేశించి "పుచ్చువంకాయ, సచ్చు వంకాయ" అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని, మరోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే "పుచ్చ లేచిపోతుంది" అని ఘాటుగా హెచ్చరించారు. తండ్రి వయసు వారన్న గౌరవంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు.

'జాగృతి జనం బాట' కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవిత, నిరంజన్ రెడ్డిపై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి మూడు ఫామ్‌హౌస్‌లు ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు. అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని ఆరోపించారు. కృష్ణా నది కాలువ సైతం ఆయన ఫామ్‌హౌస్‌ నుంచే వెళ్లేలా మళ్లించుకున్నారని స్థానికులు చెబుతున్నారని అన్నారు.

ఈ అవినీతి వ్యవహారాలు కేసీఆర్‌కు తెలియవా? లేక హరీశ్ రావు అడ్డుపడి కేసీఆర్ దృష్టికి వెళ్లకుండా కాపాడారా? అని కవిత నిలదీశారు. నిరంజన్ రెడ్డి అవినీతిపై ఇక్కడి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని, మీడియా ముఖంగా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళుతున్నానని తెలిపారు.

అదే సమయంలో, నిరంజన్ రెడ్డి అవినీతిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. హరీశ్ రావుకు సన్నిహితుడు కావడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కాపాడుతోందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. బీఆర్‌ఎస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కవిత, ఆ పార్టీలో ఉద్యమకారులు ఉండలేక సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు.


More Telugu News