పృథ్వీ షాకు అనూహ్యంగా కెప్టెన్సీ.. మహారాష్ట్ర జట్టుకు కొత్త సారథి

  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి మహారాష్ట్ర కెప్టెన్‌గా పృథ్వీ షా
  • రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు భారత వన్డే జట్టులో చోటు
  • శుభ్‌మన్ గిల్ గాయపడటంతో గైక్వాడ్‌కు దక్కిన అవకాశం
  • ఐపీఎల్ వేలానికి ముందు తనను తాను నిరూపించుకునేందుకు షాకు గోల్డెన్ ఛాన్స్‌
భారత యువ సంచలనం, డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా తన కెరీర్‌లో మరో కీలక ముందడుగు వేశాడు. త్వరలో ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అతను మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారత వన్డే జట్టుకు ఎంపిక కావడంతో ఈ బాధ్యతలు షాకు దక్కాయి. ఈ మేరకు 'స్పోర్ట్‌స్టార్' తన కథనంలో వెల్లడించింది.

ఎల్లుండి నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కానుండగా, శుక్రవారం హైదరాబాద్‌తో మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షాను కెప్టెన్‌గా నియమిస్తూ ఇవాళ‌ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అవసరమైతే కెప్టెన్సీ చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని జట్టు యాజమాన్యం షాతో ముందే చర్చించినట్లు సమాచారం.

దక్షిణాఫ్రికాతో ఈ నెల‌ 30 నుంచి జరగనున్న వన్డే సిరీస్ కోసం రుతురాజ్ గైక్వాడ్ దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయంతో సిరీస్‌కు దూరమవడంతో గైక్వాడ్‌కు ఈ అవకాశం లభించింది.

మరోవైపు మెరుగైన అవకాశాల కోసం ఈ ఏడాది ముంబై జట్టును వీడి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షాకు, తొలి సంవత్సరంలోనే కెప్టెన్సీ దక్కడం విశేషం. డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందు కెప్టెన్‌గా సత్తా చాటేందుకు ఇది అతనికి గొప్ప అవకాశం. టీ20 ఫార్మాట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న షా, ఈ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.


More Telugu News