మావోయిస్టుల బహిరంగ లేఖ.. ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి

  • ఆయుధాలు వదిలేయడానికి ఫిబ్రవరి వరకు సమయం కోరిన మావోయిస్టులు
  • భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు ఆపేయాలని డిమాండ్
  • ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఉద్దేశించి లేఖ
మావోయిస్టులపై సీరియస్ గా దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలోగా మావోయిస్టులను ఏరివేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా భద్రతా బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ మావోయిస్టులకు లొంగిపోవాలని సూచించింది. ఇటీవల జరిగిన పలు ఎన్ కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలు మరణించిన విషయం తెలిసిందే. పలువురు మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టి ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలన్న ప్రభుత్వ సూచనపై ఈ లేఖలో సానుకూలంగా స్పందించారు.

అయితే, ఆయుధాలు వదిలేందుకు తమకు కొంత సమయం కావాలని, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం ఇస్తే లొంగిపోతామని పేర్కొన్నారు. అప్పటి వరకు కూంబింగ్ ఆపరేషన్లను ఆపేయాలని, అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలను వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూంబింగ్ ఆపరేషన్లు వెంటనే నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. కూంబింగ్‌ ఆపరేషన్‌ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈమేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌(ఎంఎంసీ) స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి అనంత్‌ పేరిట బహిరంగ లేఖ విడుదలైంది.

లేఖలో ఏముందంటే..
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కామ్రేడ్‌ సోను దాదా నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎంఎంసీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ ఆయుధాలను వదిలి వేయాలని భావిస్తోంది. అయితే, ఇందుకు ఫిబ్రవరి 15 వరకు సమయం కావాలి. ఈమేరకు గడువు ఇవ్వాలని ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత సమయం అడిగేందుకు ఇతర ఉద్దేశాలేమీ లేవు. ఆయుధాలను వదిలి పెట్టాలన్న నిర్ణయంపై సహచరులను సంప్రదించి అందరి ఆమోదం పొందేందుకు సమయం పడుతుంది. కమ్యూనికేట్‌ చేసేందుకు మాకు వేరే సులభ మార్గాలు లేనందున ఈ వ్యవధిని కోరుతున్నాం. ఈ సమయంలో పీఎల్జీఏ వారోత్సవాన్ని నిర్వహించండం సహా అన్ని కార్యకలాపాలను ఆపేస్తాం. అదే సమయంలో కూంబింగ్ ఆపరేషన్లను ఆపేయాలని ప్రభుత్వాలను కోరుతున్నాం” అని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు.


More Telugu News