భారత్‌కు తొలి మహిళా వరల్డ్ స్నూకర్ టైటిల్.. చరిత్ర సృష్టించిన అనుపమ

  • మహిళల విభాగంలో భారత్‌కు ఇదే తొలి ప్రపంచ స్నూకర్ టైటిల్‌
  • ఫైనల్‌లో హాంగ్‌కాంగ్ క్రీడాకారిణిపై 3-2 తేడాతో ఉత్కంఠ విజయం
  • చదువు, క్రీడల్లోనూ ప్రతిభ చాటుతున్న చెన్నైకి చెందిన 23 ఏళ్ల అనుపమ
భారత క్యూ స్పోర్ట్స్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం లిఖించబడింది. చెన్నైకి చెందిన 23 ఏళ్ల అనుపమ రామచంద్రన్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌గా అవతరించి దేశం గర్వపడేలా చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఐబీఎస్ఎఫ్ వరల్డ్ స్నూకర్ (15-రెడ్) ఫైనల్‌లో ఆమె హాంగ్‌కాంగ్‌కు చెందిన, మూడుసార్లు ఛాంపియన్ అయిన ఎన్జీ ఆన్ యీపై 3-2 తేడాతో అద్భుత విజయం సాధించింది. మహిళల విభాగంలో భారత్‌కు ఇదే మొట్టమొదటి ప్రపంచ స్నూకర్ టైటిల్ కావడం విశేషం.

నిర్ణయాత్మక చివరి ఫ్రేమ్‌లో మ్యాచ్ నువ్వా? నేనా? అన్నట్టు సాగింది. స్కోరు 60-61తో ఉన్నప్పుడు విజయానికి అడుగు దూరంలో నిలిచిన ఎన్జీ ఆన్ యీ చివరి బ్లాక్ బాల్‌ను మిస్ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అనుపమ, ఒత్తిడిని జయించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

చెన్నైలోని విద్యా మందిర్ స్కూల్‌లో చదివిన అనుపమ, ప్రస్తుతం ఎంఓపీ వైష్ణవ్ కాలేజీలో పబ్లిక్ పాలసీలో పీజీ చేస్తున్నారు. చదువును, అంతర్జాతీయ స్థాయి క్రీడను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన మామ కె. నారాయణన్ దగ్గర ఆమె శిక్షణ పొందుతున్నారు. జూనియర్ స్థాయిలో 8 జాతీయ టైటిళ్లు గెలిచిన అనుపమ, గతంలో అమీ కమానీతో కలిసి 2023లో ఉమెన్స్ స్నూకర్ వరల్డ్ కప్ గెలుచుకున్నారు. అదే ఏడాది అండర్-21 ప్రపంచ టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నారు. తాజాగా ఈ చారిత్రక విజయంతో ఆమె కెరీర్ కొత్త శిఖరాలకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.




More Telugu News