హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలపై ఎస్ఓటీ ఉక్కుపాదం

  • హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
  • ఒకేసారి 8 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసిన మాదాపూర్ ఎస్ఓటీ
  • న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా
  • నిందితుల నుంచి హెరాయిన్, ఎండీఎంఏ, గంజాయి స్వాధీనం
హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తున్న ముఠాలపై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఒకేసారి మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, 8 మంది డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా హెరాయిన్, ఎండీఎంఏ, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే... చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పక్కా సమాచారంతో పట్టుకున్నారు. బెంగళూరు నుంచి న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం డ్రగ్స్ తీసుకువస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అలాగే నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరోవైపు, కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిపిన దాడిలో 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులపై సంబంధిత పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేసి, నిందితులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.




More Telugu News