దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టాపార్డర్‌ విఫలం.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

  • యశస్వి జైస్వాల్ అర్ధశతకం చేసినా కుప్పకూలిన మిడిలార్డర్
  • టీ విరామ సమయానికి 102 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్
  • ఇంకా 387 పరుగులు వెనుకబడిన టీమిండియా
  • పంత్, జడేజా జోడీపైనే తొలి ఇన్నింగ్స్ భారం
దక్షిణాఫ్రికాతో గువాహ‌టి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. మూడో రోజు టీ విరామ సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. పటిష్ఠ‌ స్థితిలో ఉన్నట్టు కనిపించినా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటైన తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రిషభ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. భారత్ ఇంకా 387 పరుగుల వెనుకంజలో ఉంది.

ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58) అద్భుతమైన అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ ఒక వికెట్ నష్టానికి 95 పరుగులతో పటిష్ఠంగా కనిపించింది. అయితే, జైస్వాల్ ఔటైన వెంటనే సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత్ 102/4తో కష్టాల్లో పడింది. కేవలం 7 పరుగుల తేడాతో 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకునే బాధ్యత పంత్, జడేజాపై పడింది.

అంతకుముందు దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత సంతతికి చెందిన ఆల్‌రౌండర్ సెనురన్ ముత్తుసామి (107) తన తొలి టెస్టు సెంచరీతో రాణించగా, మార్కో యన్‌సెన్ కేవలం 91 బంతుల్లో 93 పరుగులు చేసి వేగంగా ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.


More Telugu News