ధనుశ్‌ కామెంట్.. మృణాల్ రిప్లై.. మళ్లీ వార్తల్లో జంట!

  • మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై స్పందించిన ధనుశ్‌
  • వైరల్ అవుతున్న వీరిద్దరి కామెంట్, రిప్లై స్క్రీన్‌షాట్
  • గతంలో ప్రీమియర్ షోలో వీరి కౌగిలింతతో మొదలైన వదంతులు
  • మళ్లీ తెరపైకి వచ్చిన ధనుశ్‌, మృణాల్ డేటింగ్ రూమర్లు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్‌, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వస్తున్న ఊహాగానాలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మృణాల్ పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు ధనుశ్‌ చేసిన ఒకే ఒక్క కామెంట్, దానికి ఆమె ఇచ్చిన రిప్లై.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మళ్లీ జోరందుకుంది.

వివరాల్లోకి వెళితే... మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటిస్తున్న కొత్త చిత్రం 'దో దీవానే షెహర్ మే'. ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న టీజర్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ పోస్ట్‌పై స్పందించిన ధనుశ్‌.. "చూడటానికి, వినడానికి బాగుంది" అని కామెంట్ చేశారు. దానికి మృణాల్ బదులిస్తూ హార్ట్‌, స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్ క్షణాల్లో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ వారిని 'తలైవా', 'తలైవి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి వీరిద్దరిపై రూమర్లు రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులో 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమా ప్రీమియర్‌లో ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకోవడంతో అప్పటినుంచే వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. తాజా ఘటనతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మరోవైపు మృణాల్ కొత్త సినిమా టీజర్‌లోని నేపథ్య సంగీతం, ధనుశ్‌ పాత చిత్రం '3' మ్యూజిక్‌ను పోలి ఉందంటూ కూడా కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇక, సినిమాల విషయానికొస్తే ధనుశ్‌ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో 'తేరే ఇష్క్ మే' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల‌ 28న విడుదల కానుంది. మరోవైపు మృణాల్ ఠాకూర్ చేతిలో 'దో దీవానే షెహర్ మే', 'డకాయిట్' వంటి పలు ప్రాజెక్టులు ఉన్నాయి.


More Telugu News