ప్రభుత్వ టీచర్‌ బోధనకు మంత్రి లోకేశ్ ఫిదా.. ట్విట్టర్‌లో ప్రశంసలు

  • ఆటపాటలు, సామెతలతో వినూత్నంగా బోధిస్తున్న కౌసల్య టీచర్
  • ఇంగ్లిష్, మ్యాథ్స్‌ను సులభంగా నేర్పిస్తున్నారన్న మంత్రి లోకేశ్ 
  • సోషల్ మీడియాలో టీచర్ ఎడ్యుటైన్‌మెంట్ కంటెంట్‌ను మెచ్చుకున్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ పాఠశాలల్లో తమదైన శైలిలో విద్యార్థులకు బోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులను ఎక్స్ వేదికగా అభినందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి వినూత్న బోధనా పద్ధతిని నారా లోకేశ్ ప్రశంసించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్న ఆమెను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం, పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుకెరామిరెడ్డిపల్లి కౌసల్య సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థులలో ఒకరిగా కలిసిపోయి ఆటపాటలతో, సామెతలు, సూక్తులతో పాఠాలు బోధించే విధానం తనను ఆకట్టుకుందని లోకేశ్ పేర్కొన్నారు.

ముఖ్యంగా “English made easy”, “Lets learn with techniques” అనే పద్ధతుల్లో విద్యార్థులకు ఇంగ్లిష్, గణితం వంటి కష్టమైన సబ్జెక్టులను కూడా సులువుగా నేర్పించడం ప్రశంసనీయమని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కౌసల్య టీచర్ చేస్తున్న ఎడ్యుటైన్‌మెంట్ (వినోదంతో కూడిన విద్య) కంటెంట్ చాలా బాగుందని మంత్రి కొనియాడారు. 


More Telugu News