Srisailam: శ్రీశైలంలో ఏపీ టూరిజం హోటల్ పేరిట నకిలీ వెబ్ సైట్ తో మోసం

Srisailam AP Tourism Hotel Fake Website Scam Exposed
  • శ్రీశైలం హరిత హోటల్ పేరిట నకిలీ వెబ్‌సైట్ గుర్తింపు
  • ఆన్‌లైన్‌లో రూ.15,950 చెల్లించి మోసపోయిన బెంగళూరు పర్యాటకుడు
  • ఏడాది కాలంగా కొనసాగుతున్న ఆన్‌లైన్ మోసం
  • ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు
  • అధికారిక వెబ్‌సైట్‌లోనే బుకింగ్స్ చేసుకోవాలని అధికారుల సూచన
శ్రీశైలంలోని ఏపీ టూరిజం హరిత హోటల్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా భక్తులను మోసం చేస్తున్న ఈ ముఠా వలలో చిక్కిన ఓ పర్యాటకుడు భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు శ్రీశైలంలో వసతి, దర్శనం కోసం ఆన్‌లైన్‌లో వెతికారు. హరిత హోటల్ పేరుతో కనిపించిన ఓ వెబ్‌సైట్‌ను అధికారికమైనదిగా నమ్మి రూ.15,950 ఫోన్‌ పే ద్వారా చెల్లించారు. బుకింగ్ రశీదు తీసుకుని గత ఆదివారం ఆయన శ్రీశైలం చేరుకున్నారు. స్థానిక పర్యాటక శాఖ రిసార్ట్‌కు వెళ్లి రశీదు చూపించగా అది నకిలీదని సిబ్బంది చెప్పడంతో ఆయన షాక్ తిన్నారు.

తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కాగా ఈ నకిలీ వెబ్‌సైట్‌పై హరిత రిసార్ట్ మేనేజర్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే శ్రీశైలం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు అప్పట్లో చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి మోసాలు పునరావృతమవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో పర్యాటకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వసతి గదుల కోసం గుర్తుతెలియని వెబ్‌సైట్లను ఆశ్రయించకుండా కేవలం ఏపీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుకింగ్స్ చేసుకోవాలని స్పష్టం చేశారు. 
Srisailam
AP Tourism
Haritha Hotel
Fake Website
Cyber Crime
Online Fraud
Andhra Pradesh Tourism
Srisailam Temple
Tourism Scam
Hotel Booking

More Telugu News