Rajnath Singh: సింధ్ మళ్లీ భారత్ లో కలిసే అవకాశం... రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

Rajnath Singh on possible Sindh reunification with India
  • పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం తిరిగి భారత్‌లో కలవొచ్చన్న రాజ్‌నాథ్ సింగ్
  • సరిహద్దులు శాశ్వతం కాదని, నాగరికత పరంగా సింధ్ మనదేనని వ్యాఖ్య
  • దేశ విభజనను సింధీలు మానసికంగా అంగీకరించలేదన్న అద్వానీ మాటల ప్రస్తావన
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం ఏదో ఒక రోజు తిరిగి భారతదేశంలో కలవొచ్చని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో అంతర్భాగమైన సింధ్‌తో భారత్‌కు విడదీయరాని నాగరికత, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన కొత్త చర్చకు తెరలేపారు.
 
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిన్న విశ్వ సింధీ హిందూ ఫౌండేషన్ నిర్వహించిన "సశక్త్ సమాజ్ - సమృద్ధ్ భారత్" కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "భౌగోళికంగా సింధ్ ప్రస్తుతం మనతో లేకపోవచ్చు. కానీ నాగరికత పరంగా అది ఎప్పుడూ భారతదేశంలో అంతర్భాగమే. చరిత్రలో సరిహద్దులు ఎన్నోసార్లు మారాయి. ఎవరు చెప్పగలరు, భవిష్యత్తులో సింధ్ మళ్లీ మన దేశంలో కలవొచ్చేమో" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
సింధ్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీని ప్రస్తావిస్తూ.. దేశ విభజనను సింధీ హిందువులు మానసికంగా ఎప్పటికీ అంగీకరించలేదని అన్నారు. సింధు నది పవిత్రత గురించి మాట్లాడుతూ, "హిందువులకు సింధు నది ఎంత పవిత్రమో, అక్కడి ముస్లింలు కూడా ఆ నది నీటిని మక్కాలోని 'జమ్ జమ్' నీటితో సమానంగా భావించేవారని అద్వానీజీ రాశారు" అని గుర్తుచేశారు.
 
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) కూడా ఎలాంటి సైనిక చర్య లేకుండానే భారత్‌లో విలీనమవుతుందని తాను గతంలో మొరాకోలో చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పీఓకే ప్రజలే పాకిస్థాన్ నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. సింధీ సమాజం తమ సేవ, సాంస్కృతిక వారసత్వంతో దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతోందని ప్రశంసించారు.
Rajnath Singh
Sindh
India
Pakistan
PoK
Sindh reunification
Sindh culture
LK Advani
Indo-Pak relations
Sindh River

More Telugu News