ఎస్బీఐ పేరుతో వాట్సాప్‌లో కొత్త మోసం.. వేలాది మంది ఖాతాలు ఖాళీ!

  • ఎస్బీఐ పేరుతో వాట్సాప్‌లో కొత్త తరహా సైబర్ మోసం
  • ఆధార్ అప్‌డేట్ చేయాలంటూ ఏపీకే ఫైల్స్‌తో సందేశాలు
  • లింక్ క్లిక్ చేయగానే హ్యాక్ అవుతున్న ఫోన్లు, ఖాళీ అవుతున్న ఖాతాలు
  • మంత్రులు, జర్నలిస్టుల గ్రూపుల్లోకి కూడా చొరబడిన హ్యాకర్లు
  • బ్యాంకు సెలవు రోజును అదునుగా చేసుకుని దాడి
తెలంగాణ‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో ఆదివారం ఒక్కరోజే లక్షలాది మంది వాట్సాప్‌లకు నకిలీ సందేశాలు పంపి భారీ మొత్తంలో డబ్బు కొల్లగొట్టారు. బ్యాంకులకు సెలవు దినాన్ని అదునుగా మార్చుకుని ఈ భారీ మోసానికి పాల్పడ్డారు.

‘ఈ రోజు అర్ధరాత్రిలోపు మీ ఆధార్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీ ఎస్బీఐ ఖాతా నిలిచిపోతుంది’ అంటూ హెచ్చరికతో కూడిన సందేశాన్ని సైబర్ కేటుగాళ్లు పంపారు. ఆధార్ అప్‌డేట్ కోసం ‘ఎస్బీఐ ఆధార్ అప్‌డేట్ యాప్’ పేరుతో ఒక ఏపీకే ఫైల్ లింక్‌ను జతచేశారు. ఇది నిజమైన సందేశమని నమ్మిన చాలామంది, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ లింక్‌ను క్లిక్ చేసి మోసపోయారు.

ఈ సందేశాన్ని పొరపాటున తెరిచిన వారి ఫోన్లలోని వాట్సాప్ గ్రూపులన్నింటిలోకి హ్యాకర్లు సులువుగా ప్రవేశించారు. జర్నలిస్టులు, మంత్రులు, చివరికి సీఎంఓ వాట్సాప్ గ్రూపులను కూడా వదల్లేదు. అనేక గ్రూపుల అడ్మిన్లను కంట్రోల్ తీసుకుని, వాటి డీపీలను ఎస్బీఐ లోగోతో మార్చేశారు. ఓ జర్నలిస్టుకు వచ్చిన సందేశాన్ని క్లిక్ చేయడంతో ఆయన ఫోన్‌లోని అన్ని గ్రూపులకు ఈ మాల్‌వేర్ వ్యాపించిందని తెలిసింది.

ఈ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఫోన్లు హ్యాంగ్ అవ్వడం, బ్యాంకు ఖాతాల్లోని డబ్బు మాయమవడం జరిగాయి. దీంతో వేలాది మంది బాధితులు సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫైల్ ఇన్‌స్టాల్ కాగానే ఫోన్‌లోని ఓటీపీలు, ఎస్ఎంఎస్‌లు, యూపీఐ పిన్‌ల వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కుతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే వారు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. అంతేకాకుండా బాధితుల ఫోన్ నుంచి వారి కాంటాక్టులకు డబ్బు అడుగుతూ సందేశాలు పంపడం, స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేయడం వంటివి కూడా చేస్తున్నట్లు గుర్తించారు.


More Telugu News