పవన్ ను అప్పుడూ విమర్శించలేదు... ఇకముందూ విమర్శించను: విజయసాయిరెడ్డి

  • అవసరమైతే రాజకీయాల్లోకి తిరిగి వస్తానన్న విజయసాయి రెడ్డి
  • జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తాను దూరంగా ఉంటున్నానని వెల్లడి
  • చంద్రబాబుతో తనకు ఎలాంటి వైరం లేదని స్పష్టీకరణ
  • పవన్ కల్యాణ్ 20 ఏళ్లుగా తన మిత్రుడని వ్యాఖ్య
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తనకు 20 ఏళ్లుగా మిత్రుడని, ఆయన్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని, భవిష్యత్తులో కూడా విమర్శించబోనని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

శ్రీకాకుళంలో ఆదివారం రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, అయితే ప్రస్తుతానికి మాత్రం రైతుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ చేరి, ఆయన్ను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.

నిబద్ధత లేని వ్యక్తుల మాటలను జగన్ నమ్మవద్దని సూచించారు. వారి వల్లే తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. అయితే, కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన గానీ, వేరే పార్టీలో చేరే ఉద్దేశం గానీ తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనపై అనేక ఒత్తిళ్లు వచ్చినా దేనికీ లొంగలేదని అన్నారు. 


More Telugu News