China Dog: 1500 కి.మీ. ప్రయాణం.. 3 నెలల తర్వాత యజమానిని చేరిన శునకం!

September Dog Reunited with Owner After 1500 km Journey
  • చైనాలో మూడు నెలల క్రితం తప్పిపోయిన పెంపుడు శునకం
  • 1500 కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా లభ్యం
  • సోషల్ మీడియా వీడియో ద్వారా గుర్తించిన యజమాని
  • యజమానిని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న శునకం
మూడు నెలల క్రితం తప్పిపోయిన ఓ పెంపుడు శునకం, సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి తన యజమాని చెంతకు చేరిన అద్భుత ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఎంతోమందిని భావోద్వేగానికి గురిచేస్తోంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని కింగ్‌డావో బీచ్‌లో గావో అనే మహిళ పెంచుకుంటున్న 'సెప్టెంబర్' అనే లాబ్రడార్ శునకం ఆగస్టు 13న తప్పిపోయింది. సమీపంలోని బీర్ ఫెస్టివల్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, అది మరో కుక్కతో కలిసి వెళ్లిపోయినట్లు కనిపించింది. గావో తన శునకం కోసం జంతు సంరక్షణ కేంద్రాల్లో, ఆన్‌లైన్‌లో విస్తృతంగా గాలించినా ఫలితం లేకపోవడంతో ఆశలు వదులుకుంది.

అయితే, సుమారు మూడు నెలల తర్వాత కింగ్‌డావోకు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంగ్షా నగరంలో భారీ వర్షంలో తడుస్తూ వీధుల్లో తిరుగుతున్న సెప్టెంబర్‌ను ఝౌ అనే మహిళ గమనించి, దాన్ని తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ శునకానికి సంబంధించిన వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి కాస్తా గావో కంటపడ్డాయి. వెంటనే ఆమె ఝౌను సంప్రదించారు.

ఈ నెల‌ 8న పెట్ రిలోకేషన్ సర్వీస్ ద్వారా గావో తన శునకాన్ని తిరిగి ఇంటికి తెప్పించుకున్నారు. యజమానిని చూడగానే సెప్టెంబర్ ఆమెపైకి దూకి కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారిని కదిలించింది. "బహుశా పర్యాటకులు ఎవరైనా దాన్ని దొంగిలించి లేదా తమతో తీసుకెళ్లి ఉండవచ్చు. ఎలాగైనా అది చాలా కష్టాలు పడింది" అని గావో అన్నారు. అయితే, తప్పిపోయిన ఈ మూడు నెలల్లో బద్దకస్తురాలైన తన శునకం ఎంతో చురుగ్గా మారిందని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అద్భుత పునఃసమాగమంపై సోషల్ మీడియాలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
China Dog
September dog
Labrador September
Lost dog reunited
Dog travels 1500 km
Qingdao dog
Changsha dog
Pet relocation
Dog owner Gao

More Telugu News