భారత్‌లో వరల్డ్ కప్.. టీమిండియా గ్రూప్‌లోనే పాకిస్థాన్.. మరోసారి దాయాదుల పోరు

  • 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్
  • భారత్, శ్రీలంక సంయుక్తంగా అందిస్తున్న ఆతిథ్యం
  • భారత్ గ్రూప్‌లో నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లు
  • పాకిస్థాన్ ఫైనల్‌కు వస్తే అహ్మదాబాద్ నుంచి కొలంబోకు వేదిక మార్పు?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే దాయాదుల సమరానికి మరోసారి రంగం సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో చోటు దక్కించుకున్నాయి. ఇటీవలే 2025 ఆసియా కప్‌ సందర్భంగా ఇరు జట్ల మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం, వివాదాస్పద సంజ్ఞల నేపథ్యంలో ఈ డ్రాకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ డ్రా ప్రకారం టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న భారత్‌తో పాటు పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ గ్రూపులో టెస్టు హోదా ఉన్నవి భారత్, పాకిస్థాన్ మాత్రమే కావడంతో ఈ రెండు జట్లు సులువుగా సూపర్ 8 దశకు చేరుకునేలా డ్రాను రూపొందించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూప్ దశలో భారత మ్యాచ్‌లు ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.

మరోవైపు సహ ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మాత్రం కఠినమైన గ్రూప్ ఎదురైంది. ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్‌లతో కూడిన గ్రూపులో శ్రీలంక తలపడనుంది. టోర్నమెంట్‌కు సంబంధించి మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్‌ను అహ్మదాబాద్ నుంచి కొలంబోకు మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


More Telugu News